జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం
- kranthi kumar
- Sep 11
- 3 min read

అటవీ అమరవీరులకు తెలంగాణ సర్కారు... ఈ శాఖ మంత్రిగా నేను కూడా అండగా నిలుస్తామని... అటవీ సంరక్షణలో ఫారెస్ట్ పోలీసులదే కీలక పాత్ర అని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని హైదరబాద్ బహుదుర్ పురలోని నెహ్రూ జూ పార్కులో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్మారక చిహ్నం వద్ద రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, ఫారెస్టు అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీరమరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలు వృధా కానివ్వకుండా, వారి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో 1984వ సంవత్సరం నుండి ఇప్పటివరకు మన రాష్ట్రంలో 22 మంది తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోవడం చాలా బాధకరమన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. అటవీ సంపదను రక్షించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అటవీ శాఖ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని అభినందించారు. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు. ఇక సుమారు 300 ఏళ్ల క్రితం (1,730 సంవత్సరంలో) రాజస్థాన్ రాష్ట్రంలోని కేజ్రలీ గ్రామంలోని బిష్ణోయి తెగకు చెందిన 360 మంది కేజ్రలీ చెట్లు కాపాడే క్రమంలో తమ ప్రాణాలు త్యాగం చేశారని మంత్రి సురేఖ గుర్తు చేశారు. ఈ సంఘటనకు గుర్తుగా, విధి నిర్వహణలో ధైర్య, సాహసాలు ప్రదర్శించి అమరులైన అటవీ శాఖ ఉద్యోగుల త్యాగం చిరస్మరణీయం చేయడానికి, ఏటా దేశవ్యాప్తంగా సెప్టెంబరు 11న “అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని” జరుపుకుంటున్నామన్నారు. 1984 నుంచి ఇప్పటివరకు మన రాష్ట్రంలో 22 మంది అటవీ అధికారులు విలువైన అటవీ సంపదను కాపాడే క్రమంలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని వారి త్యాగాన్ని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలోని అటవీ భూములను రక్షించడంలో అటవీ సిబ్బంది విశేష కృషి చేస్తున్నారన్నారు. అడవుల రక్షణ, అటవీ సంపద స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలను అరికట్టడం కోసం అటవీ శాఖ అధికారులు విశేష కృషి చేస్తున్నారు. ఫారెస్టు డిపార్టుమెంటు పరంగా మేము కూడా క్షేత్రస్థాయిలో పని చేస్తున్న అటవీ శాఖ సిబ్బందికి ఎంతో సహకారం అందిస్తున్నామన్నారు. ప్రతి జిల్లాలో వివిధ రకాల అటవీ కార్యకలాపాలకు, ఆయా ప్రాంతాల్లో పనులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన ఫ్రంట్లైన్ అధికారులకు ఏటా రూ. 10 వేలు నగదు పురస్కారం అందిస్తున్నామన్నారు. అడవి సరిహద్దులు సరిచూసుకొని, పలు చర్యలు తీసుకుంటున్నరన్నారు. కలప అక్రమ రవాణాను కట్టడి చేయడానికి సాయుధ పోలీసు దళాల సహకారం తీసుకొని ముందుకు వెళుతున్నారన్నారు. అటవీ సంరక్షణ బలోపేతానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా 2,181 వాహనాలు ఇచ్చామన్నారు. అడవుల్లో గడ్డి భూములు, నీటి వనరులు అభివృద్ది చేయడం ద్వారా పంటపొలాలు, పశువులపై వన్యప్రాణుల దాడులు అరికట్టగిలిగామన్నారు. క్రూరమృగాల దాడిలో బాధితులకు ఇచ్చే పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచామన్నారు. క్రూరమృగాల దాడిలో మరణిస్తే గతంలో రూ.5 లక్షలు ఇస్తుండగా, దానిని రూ.10 లక్షలు ఇస్తున్నామన్నారు. ప్రపంచంలోనే పచ్చదనం పెంపుదలలో మూడవ అతి పెద్ద మానవ ప్రయత్నం, తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “వనమహోత్సవం” ద్వారా మన రాష్ట్రంలో 307.48 కోట్లకు పైగా మొక్కలను ఇప్పటి వరకు నాటడం జరిగిందన్నారు. ప్రతి గ్రామ పంచాయితీలో మొక్కల పెంపక కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ వనమహోత్సవం (2025) పథకంలో ఇప్పటి వరకు 14,355 నర్సరీలను ఏర్పాటు చేశామన్నారు. గ్రామ పంచాయతీలలో 12,707 నర్సరీలు, మున్సిపాలిటీలలో 600 నర్సరీలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడానికి, క్షీణించిన అడవులలో అటవీ పునరుద్ధరణ పనులను అన్నీ జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందన్నారు. పీడీ యాక్టుకు తగిన సవరణలు చేసి ఫారెస్టు అధికారులపై దాడి చేసే నేరస్తులపై కఠినమైన శిక్షలు పడేలా చేయడానికి తగు చర్యలు తీసుకుంటారన్నారు. పంచాయతీ చట్టం, పురపాలక చట్టం ద్వారా గ్రామాలలో మున్సిపాలిటీల్లో నాటిన మొక్కలను సంరంక్షించడానికి స్పష్టమైన ఆదేశాలను ఇచ్చామన్నారు. ప్రకృతి పరంగా లభించిన సహజ వనరులను కాపాడుకోవడంతో పాటు అభివృద్ధి చేయడం మన అందరి భాద్యత అన్నారు. అటవీ సంపద, వన్యప్రాణులను కాపాడే ప్రయత్నంలో, విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన అటవీ సిబ్బంది అంకిత భావం చిరస్మరణీయం, స్పూర్తిదాయకమన్నారు. ఈ అకుంఠిత కార్యదీక్షలో నిస్వార్థంగా పని చేయటానికి సంపూర్ణ సహకారం అందించిన అమర వీరుల కుటుంబ సభ్యులకు మా ప్రగాడ సానుభూతి తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా మన అటవీ శాఖ సోదరుల ధైర్య సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకొని అటవీ సంపద పరిరక్షణలో పునరంకితమవుదామని ప్రతిజ్ఞ చేద్దామన్నారు. మన రాష్ట్రంలో, దేశంలో అడవుల సంరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ అధికారులను స్మరించుకుంటూ, వారి ప్రాణ త్యాగాలకు జోహార్లు అర్పిస్తున్నానీ మంత్రి సురేఖ చెప్పారు. పోలీసు విధి నిర్వహణలో చనిపోయిన కుటుంబాలకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో... అటవీ అమరవీరులకి కూడా అందాలని సీఎస్ రామకృష్ణరావు, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణలకి మంత్రి సురేఖ తన ప్రసంగం ద్వారా సూచన చేశారు. తమ అటవీ అధికారుల మీద దాడి జరిగిన ప్రతిసారి తెలంగాణ డీజీపీ జితేందర్ సహకారం తమకు ఉంటుందని... అందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.















Comments